Rakul Preet Singh: సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా స్పందించారు. తన శరీరంలో వచ్చిన మార్పులకు ప్లాస్టిక్ సర్జరీ కారణమంటూ ఓ వ్యక్తి చేసిన పోస్టును ఆమె ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రమాదకరమని పేర్కొంటూ అభిమానులను అప్రమత్తం చేశారు.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి, రకుల్ సన్నబడటానికి కారణం ప్లాస్టిక్ సర్జరీ అంటూ ఓ డాక్టర్ వీడియోను షేర్ చేశాడు. ఆమె ఎంత వ్యాయామం చేసినా ఫలితం రాకపోవడంతో చివరకు సర్జరీ చేయించుకుందనే విధంగా ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
దీనిపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్, ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అసంతృప్తిని వెల్లడించారు. “నిజాలు తెలుసుకోకుండా కొందరు ప్రజలను తప్పుడు సమాచారంతో తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది నిజంగా భయానకం” అని ఆమె వ్యాఖ్యానించారు. తాను సంప్రదాయ వైద్యం అయిన ఆయుర్వేదాన్ని నమ్ముతూనే, ఆధునిక వైద్యానికి కూడా గౌరవం ఇస్తానని తెలిపారు.
Also Read: Pawan Kalyan: డైరెక్టర్ సుజిత్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిఫ్ట్!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం అనేది వ్యక్తిగత విషయం అని, దానిని తాను తప్పుపట్టనని రకుల్ స్పష్టం చేశారు. అయితే కష్టపడి వ్యాయామం చేస్తే కూడా బరువు తగ్గడం సాధ్యమేనని గుర్తించకుండా, తన గురించి అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం అసహ్యంగా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా తన పేరుతో ఫేక్ వార్తలు వచ్చాయని రకుల్ గుర్తు చేశారు. ఇటీవల తన వాట్సాప్ నెంబర్ అంటూ తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందని, అప్పుడే తాను ఆ వార్తలను ఖండించానని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
చివరగా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు రకుల్ హెచ్చరిక చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తి వీడియోను కూడా తన పోస్ట్‌కు జత చేయడంతో ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
