Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడేలా స్పష్టత ఇచ్చారు. ఎంఐఎంతో మైత్రీ ఉన్న కాంగ్రెస్‌లో తాను చేరే ప్రశ్నే లేదని, తాను ఏ పార్టీకి వెళ్లబోనని స్పష్టం చేశారు.
బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్ధమేనని అన్నారు. గోషామహల్‌లో ఉపఎన్నిక జరిగినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎవరు పోటీ చేసినా తాను వెనక్కి తగ్గనని చెప్పారు.
ఈ రోజు ఉదయం లాల్‌దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజాసింగ్, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
బోనాలపై తప్పుడు ప్రచారం.. సాంస్కృతిక కుట్రలపై విమర్శలు
మహంకాళి అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన రాజాసింగ్, “ఒక మంత్రి గారితో మాట్లాడే అవకాశం లభించింది. మోడల్ గోశాల నిర్మాణానికి నా సహకారం కోరారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల మేలు చేయడమే లక్ష్యం” అని చెప్పారు.
గత ప్రభుత్వాలు సింహవాహిని మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయడాన్ని రాజకీయంగా చూస్తూ నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మవారి ఆలయాన్ని వైభవంగా నిర్మించాలని కోరుతున్నానని చెప్పారు.
“బోనాల పండుగపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాగి ఆడే పండుగలా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది బోనాల పవిత్రతను చెడగొట్టే కుట్ర. ఈ సంస్కృతిని నాశనం చేయాలనే లక్ష్యంతో చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆయన అన్నారు.
ఇటీవల బీజేపీపై అసంతృప్తితో రాజాసింగ్ జూన్ 30న పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వ్యాఖ్యలతో ఆయన బీజేపీతో నిమగ్నంగా ఉన్నట్లు స్పష్టం అయింది.
