Rahul Gandhi

Rahul Gandhi: రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం: బీజేపీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలనే నిర్వీర్యం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధాలుగా మార్చుకున్నారని స్పష్టం చేశారు.

జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని హెర్టీ స్కూల్‌ విద్యార్థులతో జరిగిన సంభాషణలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన గంట నిడివి గల వీడియోను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. ఆ వీడియోలో మాట్లాడుతూ బీజేపీ విధానాలు దేశంలో ఉద్రిక్తతను పెంచుతున్నాయని ఆయన అన్నారు.

Also Read: CM Chandrababu: క్వాంటం టెక్నాలజీకి ఏపీ కేరాఫ్ అడ్రస్.. ‘టెక్’ విప్లవానికి సీఎం చంద్రబాబు శ్రీకారం!

రాజ్యాంగం ప్రతిపాదించిన రాష్ట్రాల మధ్య సమానత్వం, భాషలు, మతాల మధ్య సమాన గౌరవం, ప్రతి వ్యక్తికి ఇచ్చిన సమాన విలువలను తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా, దేశంలోని సంస్థల నిర్మాణాన్నే తన నియంత్రణలోకి తీసుకుందని విమర్శించారు. తాము బీజేపీతో మాత్రమే కాదు, ఆ పార్టీ సంస్థలను ఆక్రమించుకున్న విధానానికి వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నామని తెలిపారు.

ప్రజాస్వామ్యంపై దాడి జరిగినప్పుడు కేవలం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తడం సరిపోదని రాహుల్ అన్నారు. దాన్ని ఎదుర్కొనే స్పష్టమైన మార్గాలను కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీని అధికారంలో నుంచి తప్పించేందుకు బలమైన ప్రతిపక్ష ప్రతిఘటన వ్యవస్థను నిర్మిస్తామని స్పష్టం చేశారు.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అది కేవలం భారతీయులకే కాకుండా ప్రపంచానికి చెందిన సంపద అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యంపై జరిగే దాడి అంతర్జాతీయ ప్రజాస్వామ్య విలువలపై జరిగే దాడిగానే భావించాలని అన్నారు. రాజ్యాంగ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకుని రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆయన మరోసారి ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *