Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, “ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర వెలుగులోకి వచ్చింది. వాళ్ల ముసుగు పూర్తిగా తొలగిపోయింది” అని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగాన్ని రద్దుచేసి, దేశంలో మనుస్మృతి అమలు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించిన రాహుల్, “కలలో కూడా అలాంటి కుట్రలు సాగనివ్వం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ సదా సిద్ధంగా ఉంటుంది” అని స్పష్టం చేశారు.
ఇందుకు నేపథ్యంలో, ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ, “అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యాంగ పీఠికలో చేర్చిన ‘సోషలిస్ట్, సెక్యులర్’ పదాలు అవసరమా? అన్నది పునర్విలువాయించాలి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాక, ఎమర్జెన్సీ విధించిన వారు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారు అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ విధించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ, దేశం మీద ఎటువంటి విధ్వంసకర భావనలకూ తాము తలవంచేది లేదని, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంతదూరమైనా పోరాడతామని హెచ్చరించారు.