PV Sindhu

PV Sindhu: మలేషియా ఓపెన్‌ సెమీస్‌లో పీవీ సింధు ఓటమి

PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో సెమీఫైనల్ దశలోనే నిష్క్రమించింది. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో ప్రపంచ రెండో నంబర్ క్రీడాకారిణి, చైనాకు చెందిన వాంగ్ జి యి చేతిలో సింధు ఓటమి పాలైంది. కాలి గాయం కారణంగా గత అక్టోబర్ నుండి ఆటకు దూరంగా ఉన్న సింధు, సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన మొదటి టోర్నీలోనే సెమీస్ వరకు చేరుకోవడం విశేషం. అయితే, కీలకమైన సెమీస్‌లో ప్రత్యర్థి దూకుడు ముందు సింధు తలవంచక తప్పలేదు. 16-21, 15-21 వరుస సెట్లలో వాంగ్ జి యి విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మ్యాచ్ ఆరంభంలో సింధు తనదైన శైలిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శక్తివంతమైన స్మాష్‌లు, క్రాస్ కోర్ట్ షాట్లతో ప్రత్యర్థిని ఇబ్బంది పెడుతూ తొలి గేమ్‌లో ఒక దశలో 5-2తో ముందంజలో నిలిచింది. ఇద్దరు క్రీడాకారిణులు పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించడంతో స్కోరు 13-13 వద్ద సమమైంది. కానీ, కీలక సమయంలో వాంగ్ జి యి తన వేగాన్ని పెంచింది. ముఖ్యంగా స్కోరు 15-14 వద్ద ఉన్నప్పుడు చైనా ప్లేయర్ వరుస పాయింట్లతో సింధుపై ఒత్తిడి పెంచి మొదటి గేమ్‌ను కైవసం చేసుకుంది.

రెండో గేమ్‌లో కూడా సింధు అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది. విరామం సమయానికి 11-6తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆ పట్టును చివర వరకు నిలుపుకోలేకపోయింది. రెండో హాఫ్‌లో వాంగ్ తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో సింధును ఉక్కిరిబిక్కిరి చేసింది. వరుస పాయింట్లు సాధిస్తూ సింధును వెనక్కి నెట్టి విజయాన్ని అందుకుంది. క్వార్టర్ ఫైనల్లో బలమైన ప్రత్యర్థి అకానె యమగుచిని ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన సింధు, అదే జోరును సెమీస్‌లో కొనసాగించలేకపోయింది.

పీవీ సింధు ఓటమితో మలేషియా ఓపెన్‌లో భారత క్రీడాకారుల ప్రస్థానం ముగిసింది. ఇప్పటికే పురుషుల డబుల్స్‌లో స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి క్వార్టర్స్ దశలోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే. టోర్నీ గెలవకపోయినా, గాయం తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చి సెమీస్ వరకు చేరుకోవడం సింధు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయమే. రాబోయే టోర్నీల్లో సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *