ఇండియన్ ఏస్ షట్లర్ పి.వి. సింధు (PV Sindhu) తన ఆటతీరుపై విశ్వాసం ప్రకటించింది. తనలో టైటిళ్లు గెలిచే సత్తా చాలానే చెప్పింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్సులో (Los Angeles) ఆడాలనుకుంటున్నానని, ఫిట్‌నెస్ కాపాడుకుంటూ మూడో ఒలింపిక్స్ పతకానికి గురిపెడతానని తెలిపింది.
యూరోపియన్ సర్క్యూట్లో ఇటీవలి పరాజయాలు, పారిస్ ఒలింపిక్స్ లో అనూహ్య ఓటముల తర్వాత సింధు పనైపోయిందంటూ వచ్చిన విమర్శలను తిప్పికొట్టింది పీవీ సింధు. రాబోయే ఒలింపిక్స్ కు సన్నద్ధమయ్యేలా తనను తాను తీర్చిదిద్దుకునేందు ప్రణాళికలు రచిస్తోంది. మరుసటి ఒలింపిక్స్ జరిగే సమయానికి సింధుకు 33 ఏళ్లు వస్తాయి. ఈ వయసులో బ్యాడ్మింటన్లో అత్యుత్తమంగా ఆడడం కష్టతరమే. అయితే గాయాలు లేకుండా, అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉంటే మూడో ఒలింపిక్స్ పతకం సాధ్యమేనన్నది సింధు అభిప్రాయం. 2016 ఒలింపిక్స్‌లో రజతం, 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సింధు.. పారిస్ క్రీడల నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ‘‘గాయాలు లేకపోతే, శారీరకంగా ఫిట్‌గా ఉంటే కచ్చితంగా లాస్ ఏంజిలెస్‌లో మూడో పతకం కోసం పోటీపడతా’’ అని సింధు పేర్కొంది.
పారిస్ ఒలింపిక్స్ లో (Paris Olympics 2024) ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయింది. ‘‘కొన్నిసార్లు గెలవలేం. రెండు ఒలింపిక్సుల్లో గొప్ప ప్రదర్శన చేశా. మూడోసారి పతకం నెగ్గలేకపోయినా… బాగానే ఆడాను. తప్పుల నుంచి నేర్చుకున్నా. మళ్లీ బలం పుంజుకుంటా. నా ఆట అయిపోలేదు. ప్రస్తుతం ఏడాది ఆటపై దృష్టిపెడుతున్నా. వచ్చే ఒలింపిక్సుకు నాలుగేళ్ల సమయముంది. నా ప్రధాన లక్ష్యం ఫిట్‌గా, గాయం లేకుండా ఉంటూ.. ఆటను ఆస్వాదించడమే’’ అని సింధు తన భవిష్యత్ ప్రణాళికలను వివరించింది. ‘‘ఇంకా నాలో సత్తా ఉంది. మరిన్ని టైటిళ్లు గెలవాలనుకుంటున్నా. మరిన్ని వేదికలపై సగర్వంగా నిలబడాలనుకుంటున్నా. వచ్చే తరానికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా’’ అని తెలిపింది. ప్రస్తుతం జపాన్, చైనాలో జరగనున్న టోర్నీలపై దృష్టి పెట్టినట్లు వివరించింది సిందు.
