Kadapa: కడప మున్సిపల్ కార్పొరేషన్… గత రెండు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోట… 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక కడప కార్పోరేషన్‌గా అవతరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ విధేయులు మాత్రమే మేయర్‌గా చెలామణి అవుతున్నారు. మొదట జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మేయర్‌గా ఉంటే ఆ తర్వాత సురేష్ బాబు ఏకచక్రాదిపత్యంగా కడప నగరాన్ని ఏలుతున్నారు. కానీ ఒకే ఒక్క సమావేశం వైసీపీ మేయర్ సీటుకు మేకై కూర్చుంది. ఎక్స్ అఫీసీయో సభ్యురాలుగా ఉన్న ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి సీటు నిరాకరించడంతో కడప కార్పోరేషన్‌లో కుర్చీలాట మొదలైంది. వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్పొరేషన్‌ను టీడీపీ చేజిక్కుంచుకోవడానికి పావులు కదిపింది. కడప కార్పోరేషన్‌లో రాజకీయం తలకిందులైంది.
అసలు కథలోకి వెళితే గతంలో కడప మేయర్ కుర్చీకి ఇరువైపులా కడప ఎమ్మెల్యేకు అలాగే కమలాపురం ఎమ్మెల్యేకు ఇద్దరికీ చైర్లు ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి జరిగిన సర్వసభ్య సమావేశంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు చైర్లు వేశారు.
Kadapa: కానీ రెండవసారి జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆ చైర్లను మేయర్ కుర్చీ పక్క నుంచి తీసివేసి కింద వేశారు. అయితే దీనిపై కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రసాభాస జరిగింది. అయితే అక్కడ నుంచే అసలు కథ మొదలైంది. తనకు మేయర్ కుర్చీ పక్కన ఉండాల్సిన చైర్‌ను తీసివేసి కింద వేశారు. దీనిని అవమానంగా భావించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రత్యేకంగా తీసుకున్నారు. అసలు కార్పొరేషన్‌ను వైసీపీ ఆధీనంలో నుంచి మార్చేస్తే పోలా అనుకుని ఆ విధంగా పావులు కదిపి సక్సెస్ అయినట్లు సమాచారం. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు సమక్షంలో పదిమంది కార్పొరేటర్‌లను టీడీపీలో చేర్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్న 10 నుంచి 15 మంది కార్పొరేటర్‌లను టీడీపీలో చేర్పించేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం…
కడప కార్పొరేషన్‌లో మొత్తం 50 స్థానాలు ఉన్నాయి. అందులో కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సమయంలో 48 వైసీపీ గెలవగా ఒకటి టీడీపీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి వైసీపీకి సపోర్ట్ చేశారు. అప్పుడు టీడీపీకి ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కడప కార్పొరేషన్‌లో ఉన్న సూర్యనారాయణ అనే కార్పొరేటర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Kadapa: ప్రస్తుతం టీడీపీకి రెండు, వైసీపీకి 48 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఈ క్రమంలో పదిమంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఇలా మరో రెండు విడతలుగా 20 మందిని చేర్చుకోవడానికి టీడీపీ రంగం సిద్ధం చేసింది. ఇందులో ముఖ్యంగా రెండవ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, మూడవ డివిజన్ కార్పొరేటర్ ముమ్మిడి మానస, ఆరో డివిజన్ కార్పొరేటర్ నాగేంద్ర, 8వ డివిజన్ కార్పొరేటర్ డైమండ్ బాలకృష్ణారెడ్డి, 32వ డివిజన్ కార్పొరేటర్ జఫరుల్లా, 42వ డివిజన్ కార్పొరేటర్ చల్లా రాజశేఖర్, 51 డివిజన్ కార్పొరేటర్ అరుణ ప్రభ ఇప్పటి వరకు టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్న వారిగా చెబుతున్నారు. ఆల్రెడీ వీరు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారని సీఎం చంద్రబాబు సమక్షంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ఆమె భర్త , టీడీపీ పోలీట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకోనున్నట్లు టాక్ నడుస్తోంది.
ఆ తర్వాత మరో వారం ఒక పది మందిని, ఆ తర్వాతి వారం మరో పదిమందిని టీడీపీలో చేర్చుకోవడానికి పూర్తిగా లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తుంది.
Kadapa: ఏది ఏమైనా తన భార్యకు కుర్చీ వేయనందుకు శ్రీనివాసరెడ్డి పగ తీర్చుకుంటున్నారని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా టీడీపీ నేతలు కూడా అదే అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మేయర్ కుర్చీ పక్కన వేసిన చైర్లు ఇప్పుడు ఎందుకు తీసివేయాల్సి వచ్చిందని వారు అడుగుతున్నారు.
దీనిపై మేయర్ సురేష్ మాట్లాడుతూ కావాలనే మా కార్పొరేటర్‌లను బెదిరించి లాక్కుంటున్నారని, వారి ఆర్థిక మూలాలపై కొడుతున్నారని అందుకే తప్పక మా కార్పొరేటర్లు టీడీపీకి వెళ్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాక వైసీపీపై కడపలో నెగ్గడం అంత సులువైన పని కాదని… మాకు నాయకత్వ లోపం ఏమీ లేదని మాకు అన్ని డివిజన్లో బలమైన నాయకత్వం ఉందని మేయర్ సురేష్ అంటున్నారు. దమ్ముంటే వారిని రాజీనామా చేయించి టీడీపీలోకి ఆహ్వానించుకుంటే మంచిదని అలా కాకుండా వైసీపీ గుర్తుపై గెలిచిన వారిని టీడీపీలోకి ఎలా తీసుకుంటారని మేయర్ సురేష్ ప్రశ్నిస్తున్నారు.
Kadapa: ఏది ఏమైనా కుర్చీలాట మాత్రం చాలా రంజుగా సాగుతోంది కుర్చీ వేయనందుకు మేయర్ పీఠాన్ని కదిలించే విధంగా ఎమ్మెల్యే మాధవి రెడ్డి పావులు కలిపారు..విషయం తెలుసుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి కార్పొరేటర్లతో చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో కార్పొరేటర్లు టిడిపి కి వెళ్లడానికి సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం.. మొత్తం మీద కడప కార్పొరేషన్ పై టిడిపి తన హవాను కొనసాగించడానికి లైన్ క్లియర్ చేసుకుంటుంది.