Pune Murder: పుణేలో ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చివరకు దారుణమైన మర్డర్ మిస్టరీగా మారింది. అయితే ఈ ఘోరానికి పగ ప్రతీకారాలు, ఆస్తి గొడవలు కారణం కాదు కేవలం పెళ్లిని వాయిదా వేసి కొంత సమయం సంపాదించుకోవడానికే ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
నిందితురాలు సియా గోయల్‌కు బిల్డర్ కేతన్ అగర్వాల్‌తో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అతడిని ముగించేస్తే మరో మూడు సంవత్సరాల వరకు పెళ్లి ప్రస్తావన రాదని ఆమె భావించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సియా ప్రియుడు చేతన్ చౌదరి కూడా తామిద్దరి పెళ్లికి ఇంకా రెండు మూడేళ్ల సమయం కావాలని అనుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటే సమాజంలో కుటుంబాల గౌరవం పోతుందని భయపడి, కేతన్‌ను పూర్తిగా పక్కకు తప్పించడమే సులువైన మార్గమని భావించి ఈ జంట హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
వీరిద్దరి మధ్య నిశ్చితార్థానికి ముందే పాత పరిచయం ఉంది. సియా అన్నయ్య సాహిల్ గోయల్ ద్వారా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో చేతన్ మొదటిసారి సియాకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత జనవరిలో కేతన్‌తో నిశ్చితార్థం జరగడానికి కొద్దిరోజుల ముందే వీరిద్దరూ స్నేహితులతో కలిసి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐదు రోజుల పాటు ట్రిప్ వేశారు. ఈ ప్రయాణంలోనే వీరి బంధం మరింత బలపడింది. కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తే జనవరి నుంచి వీరిద్దరూ 2,004 సార్లు ఫోన్ మాట్లాడుకున్నట్లు, దాదాపు 238 గంటల సమయం గడిపినట్లు తేలింది. ఇది సాధారణ పరిచయం కాదని చెప్పడానికి బలమైన ఆధారంగా నిలుస్తోంది.
హత్యకు సరిగ్గా ఒక్క రోజు ముందు, జూన్ 17న పుణేలోని లుల్లానగర్ కేఫ్‌లో సాయంత్రం వేళ వీరిద్దరూ గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మర్డర్ ప్లాన్ గురించిన చర్చలు జరిగాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నేరానికి ముందు, ఆ తర్వాత కూడా నిందితులిద్దరూ తమ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్‌లను పూర్తిగా డిలీట్ చేసి, రీసైకిల్ బిన్లను క్లియర్ చేశారు. డిజిటల్ ఆధారాలను రికవరీ చేసి క్రైమ్ టైమ్‌లైన్‌ను మ్యాచ్ చేయడానికి ఫోరెన్సిక్ బృందం ప్రయత్నిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సియా అన్నయ్య సాహిల్‌ను పోలీసులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. చేతన్‌తో ఉన్న పరిచయంపై వివరాలు సేకరించిన అధికారులు, త్వరలోనే కుటుంబంలోని మిగిలిన సభ్యుల స్టేట్మెంట్లను కూడా రికార్డు చేయనున్నారు.
