TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని ఉవ్విళ్ళూరుతున్న టీవీకే (TVK) అధినేత విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మరోసారి గట్టి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజార్టీ (మ్యాజిక్ ఫిగర్ 118) ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో విజయ్ ముఖ్యమంత్రి అయ్యే ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది.
గవర్నర్ అడిగిన కఠిన ప్రశ్నలివే..
గురువారం నాడు విజయ్ రెండోసారి గవర్నర్‌ను కలిసి, తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అయితే, గవర్నర్ విజయ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. “ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది మద్దతు అవసరం కాగా, మీ దగ్గర కేవలం 112 మంది మాత్రమే ఉన్నారు.. మరి మిగిలిన సంఖ్యాబలం లేకుండా ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణం చేస్తారు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, టీవీకేకు మద్దతు ఇచ్చే ఇతర పార్టీలు ఏవి? అసెంబ్లీలో మెజార్టీని ఎలా నిరూపించుకుంటారు? అని గవర్నర్ నిలదీశారు.
అతిపెద్ద పార్టీ అయినా తప్పని తిప్పలు:
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర మద్దతుదారులతో కలిపి ఆ సంఖ్య 112కు చేరింది. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ముందుగా ప్రమాణ స్వీకారానికి పిలవాలని, ఆ తర్వాత అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటామని విజయ్ కోరారు. కానీ, రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలన్నదే తన ఉద్దేశమని, ముందే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాలను చూపిస్తేనే ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తానని గవర్నర్ కుండబద్దలు కొట్టారు.
విజయ్ తదుపరి అడుగు ఎటు?
గవర్నర్ అడిగిన ప్రశ్నలకు విజయ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ప్రస్తుతానికి ఈ వ్యవహారం ఎటూ తేలలేదు. మద్దతు ఇవ్వని వారు ప్రమాణ స్వీకారం తర్వాత మద్దతు ఇస్తారని ఎలా ఊహిస్తారని గవర్నర్ అడిగిన ప్రశ్నకు టీవీకే వర్గాలు తలమునకలవుతున్నాయి. ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం విజయ్‌కు పెద్ద సవాలుగా మారింది. మరి గవర్నర్ పెట్టిన ఈ కండిషన్‌ను విజయ్ ఎలా అధిగమిస్తారో, తమిళనాడు రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.
