Prashant Kishore: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త Prashant Kishor సంచలన ఆరోపణలు చేశారు. తన పార్టీ ఒక్క సీటూ గెలవకపోవడం నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “ఎన్నికల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగిందన్న అనుమానం నాకు గట్టిగా ఉంది” అని వ్యాఖ్యానించారు. పోలింగ్‌కు ముందు తమ బృందం సేకరించిన ప్రజాభిప్రాయ సర్వేలకు, వాస్తవ ఫలితాలకు అస్సలు పొంతన లేదని తెలిపారు.
అయితే, రిగ్గింగ్ జరిగిందని అనుమానించినప్పటికీ దీనిని నిరూపించేందుకు తన వద్ద ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఓటమి తరువాత రాజకీయ జీవితం ముగిసిందన్న ప్రచారాన్ని ఖండించిన పీకే, “వచ్చే ఐదేళ్లు బీహార్ లోనే ఉంటాను, ప్రజల్లోకే వెళ్తాను” అని చెప్పుకొచ్చారు.
తమపై ఈవీఎంల మార్పిడి ఆరోపణలు చేయమని కొందరు ఒత్తిడి తెస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే ఓటమి పాలైన ప్రతీ నాయకుడు చేసే ఆరోపణలు ఇవే అవుతాయని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రజలకు అస్సలు పరిచయమే లేని కొన్ని పార్టీలకు లక్షలాది ఓట్లు పడటం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. బీహార్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ఇప్పటికైతే సరైన ఆధారాలు తన వద్ద లేవని పీకే మరోసారి స్పష్టం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిన తర్వాత అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని మహిళలకు రూ.10 వేలు పంపిణీ చేయడంపై ప్రశాంత్ కిశోర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకం ప్రకటించకపోతే ఎన్డీయే ఘోర ఓటమి పాలయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు జరిగే ఈ రకమైన పథకాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు
