Mr. India 2026: 

Mr. India 2026: టెన్నిస్ కోర్టు నుండి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మిస్టర్ ఇండియా ఫైనల్స్‌లో కడప యువకుడు!

Mr. India 2026:  తమిళనాడు తరపున ‘మిస్టర్ ఇండియా 2026’ పోటీల్లో పాల్గొంటున్న ప్రధాన్ రాఘవ, తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. అయితే తన మూలాలు మాత్రం తెలుగు నేలలోనే ఉన్నాయని ఆయన గర్వంగా చెబుతున్నారు.

తెలుగు మూలాలు – కుటుంబ నేపథ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలోని ఈటుమారిపురం గ్రామం ప్రధాన్ రాఘవ పూర్వీకుల నివాసం ఉండేవారు.  తండ్రి రాఘవ వెంకట సత్యనారాయణ ఉద్యోగ రీత్యా 1965లో తమిళనాడుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రధాన్ తల్లి పేరు శిరీష, సోదరుడు సాయికీర్తి ప్రస్తుతం క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రధాన్ చెన్నైలోని ప్రతిష్ఠాత్మక లయోలా కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు.

ప్రమాదాన్ని జయించి.. మోడలింగ్‌లో రాణించి..

ప్రధాన్ రాఘవ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నతనం నుండి క్రీడలపై మక్కువ పెంచుకున్న ఆయన, ఖేలో ఇండియా టెన్నిస్ పోటీల్లో విశ్వవిద్యాలయ స్థాయి విజేతగా నిలిచారు. కరోనాకు ముందు జరిగిన ఒక భారీ రోడ్డు ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. దీనివల్ల ఆయన టెన్నిస్ క్రీడకు దూరం కావాల్సి వచ్చింది. శారీరక ఇబ్బందులను ఎదుర్కొని కోలుకున్న తర్వాత, తన ఆత్మవిశ్వాసంతో మోడలింగ్ వైపు అడుగులు వేశారు. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మిస్టర్ ఇండియా లక్ష్యం

‘రుబారు’ సంస్థ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఎంపికైన 18 మంది అభ్యర్థుల్లో ప్రధాన్ ఒకరు.

మూడు నెలల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహించిన పలు కఠిన పరీక్షల్లో నెగ్గి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఫైనలిస్టుల శిక్షణలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఎంపికయ్యే టాప్-8 సభ్యుల్లో తాను తప్పక ఉంటానని ఆయన ధీమాతో ఉన్నారు.

జూన్ లేదా జూలై నెలలో ముంబయిలో తుది దశ పోటీలు జరగనున్నాయి. అక్కడ ఎంపికయ్యే ముగ్గురు విజేతలు ‘మిస్టర్ యూనివర్స్’ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.

భవిష్యత్తులో మోడలింగ్‌తో పాటు వెండితెరపై కూడా తన ముద్ర వేయడమే లక్ష్యంగా ప్రధాన్ రాఘవ ముందుకు సాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *