The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన భారీ హారర్ ఫాంటసీ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలంగా ప్రభాస్‌ను కేవలం సీరియస్ రోల్స్‌లోనే చూస్తున్న అభిమానులకు, ఆయనలోని అసలైన కామెడీ యాంగిల్‌ను, వింటేజ్ ‘డార్లింగ్’ లుక్‌ను ఈ సినిమా గుర్తుచేస్తోంది. హారర్ ఎలిమెంట్స్, కామెడీ, భారీ యాక్షన్ కలయికతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సందడి చేస్తోందో ఇప్పుడు చూద్దాం.
కథా నేపథ్యం
దేవనగర సంస్థానానికి చెందిన జమీందారిణి గంగాదేవి (జరీనా వహాబ్), తన మనవడు రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్)తో కలిసి గతం తెలియని సామాన్య జీవితాన్ని గడుపుతుంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే ఆమె, తన భర్త కనకరాజు (సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. కలలో కనిపిస్తున్న తన తాతని వెతకమని రాజుని కోరడంతో, అతను హైదరాబాద్‌కు వస్తాడు. ఈ క్రమంలోనే రాజు జీవితంలోకి భైరవి (మాళవిక మోహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్), అనిత (రిద్ది కుమార్) అనే ముగ్గురు అమ్మాయిలు వస్తారు. అయితే, కనకరాజు ఓ భారీ కుట్రతో నర్సాపూర్ అడవుల్లోని మాయా కోటలోకి గంగాదేవిని, రాజుని రప్పిస్తాడు. తాంత్రిక విద్యలు తెలిసిన తాత కనకరాజు నుండి రాజు తన నాయనమ్మను, రాజవంశ సంపదను ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే?
సినిమా ప్రారంభంలో ప్రభాస్ ఎంట్రీ, ఆయన లుక్ అభిమానులకు పాత ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ సినిమాల రోజులను గుర్తుచేస్తాయి. ప్రథమార్ధంలో పాత్రల పరిచయం, కామెడీ ట్రాక్స్ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, కథ రాజమహల్‌లోకి ప్రవేశించిన తర్వాత అసలు వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది.సెకండ్ హాఫ్‌లో సంజయ్ దత్ నటన, సముద్రఖని పాత్రలు సినిమాకు బలాన్ని ఇచ్చాయి. హారర్ ఎలిమెంట్స్ అక్కడక్కడా భయపెట్టినప్పటికీ, కొన్ని కీలక సన్నివేశాల్లో ఉండాల్సినంత టెన్షన్ కనిపించదు. మారుతి ఎంచుకున్న హారర్-కామెడీ జోనర్ కొంతమందిని అలరించినా, పక్కా మాస్ బ్లాక్ బస్టర్ ఆశించే వారికి మాత్రం కొంత అసంతృప్తి కలగవచ్చు.
అయితే, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలను మారుతి అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించారు. కొత్త తరహా ట్రీట్‌మెంట్‌తో ఈ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. తమన్ అందించిన నేపథ్య సంగీతం (BGM) హారర్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో కీలకంగా నిలిచింది. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ.. “మారుతి.. ఈ కథను పెన్‌తో రాశావా లేక గన్‌తో రాశావా?” అని ప్రభాస్ అన్న మాటలతో ఆకాశమంత హైప్ పెరిగినప్పటికీ, తీరా సినిమా చూశాక ఆ స్థాయిలో మ్యాజిక్ వర్కౌట్ కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారనే చెప్పాలి.
మొత్తానికి, ‘ది రాజాసాబ్’ ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ కాకపోయినప్పటికీ, ప్రభాస్ వింటేజ్ లుక్ కోసం, ఫ్యామిలీతో కలిసి చూసే హారర్ కామెడీ అంశాల కోసం ఈ సంక్రాంతికి ఒకసారి చూడదగ్గ చిత్రంగా నిలిచింది.
