Fauzi: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘ఫౌజీ’ నుండి గ్లింప్స్ ని మూవీ టీమ్ విడుదల చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా సినిమా 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో ఈ సినిమాను 2026 డిసెంబరు 3న విడుదల చేయాలని భావించినప్పటికీ, నిర్మాణానంతర పనుల దృష్ట్యా వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. దింతో అదే నెలలో రావాలనుకున్నస్పిరిట్ సినిమా అక్టోబర్ 29కి పోస్ట్ పోన్ అయింది.
‘ఫైల్ నెంబర్ 25’ పేరుతో విడుదలైన ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెర్లిన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. భారతదేశ విముక్తి పోరాటానికి జర్మనీ సహకరించాలని బోస్ కోరగా, రెండు శతాబ్దాలుగా బ్రిటిష్ పాలకుల అధీనంలో ఉన్న దేశ పోరాటానికి మద్దతు ఇవ్వలేనని హిట్లర్ సమాధానమిస్తాడు. దీనికి ప్రతిస్పందనగా నేతాజీ భారతీయ పరాక్రమాన్ని వివరిస్తూ, బ్రిటిష్ సైన్యానికి సైతం అంతుచిక్కని భారతీయ గూఢచారి ‘ఫౌజీ’ గురించిన రహస్యాన్ని వెల్లడిస్తారు.
