PNB Scam Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎన్‌బీ మోసం కేసులో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారతదేశానికి అప్పగించేందుకు బెల్జియం ప్రభుత్వంతో చర్చలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో చోక్సీని భారత్‌కు అప్పగించిన పక్షంలో అతని నిర్బంధానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు, మానవ హక్కుల రక్షణకు సంబంధించిన హామీలను భారత హోంమంత్రిత్వ శాఖ (MHA) బెల్జియం న్యాయ మంత్రిత్వ శాఖకు లిఖితపూర్వకంగా అందించింది.
చోక్సీ నిర్బంధానికి ప్రత్యేక ఏర్పాట్లు
ఏప్రిల్‌లో బెల్జియంలో అరెస్టైన చోక్సీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోని ప్రత్యేక బ్యారక్ నంబర్ 12లో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ బ్యారక్ అహింసా నేరస్థుల కోసం ప్రత్యేకంగా ఉండటమే కాకుండా సీసీటీవీ నిఘా, అధునాతన భద్రతా పర్యవేక్షణ వ్యవస్థలతో సిద్ధంగా ఉంది.
ప్రతి ఖైదీకి CPT (European Committee for the Prevention of Torture) ప్రమాణాలకు అనుగుణంగా కనీసం మూడు చదరపు మీటర్ల వ్యక్తిగత స్థలాన్ని కల్పించారు. జైలులో శుభ్రత, నిరంతర నీటి సరఫరా, ఫ్లష్ టాయిలెట్లు, వాష్ బేసిన్లు, వెంటిలేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
ఆహారం, వైద్య సేవల్లో పూర్తి హామీలు
రోజుకు మూడు సార్లు తగినంత ఆహారం, వైద్య సలహాల మేరకు ప్రత్యేక ఆహారం, పండ్లు, ప్రాథమిక స్నాక్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. 20 పడకల జైలు ఆసుపత్రి, ICU సేవలు, 24 గంటల వైద్య సిబ్బంది, అత్యవసర పరిస్థితుల్లో JJ హాస్పిటల్స్‌కు రిఫరల్ సౌకర్యాలు కల్పించనున్నట్లు హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రైవేట్ వైద్య సదుపాయాలు కూడా చట్టపరమైన అనుమతులతో వ్యక్తిగత ఖర్చుపై పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Supreme Court: రేవంత్ రెడ్డికి ఊరట.. రాజకీయ విషయాలలో మమ్మల్ని లాగకండి.
వినోదం, పునరావాసానికి ప్రాధాన్యం
ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఓపెన్ యార్డ్‌లో వ్యాయామం, ఇండోర్ గేమ్స్, యోగా, ధ్యానం, లైబ్రరీ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అధికార లేఖలో పేర్కొంది. చట్టపరమైన సలహా కోసం న్యాయవాదులతో సమావేశం, కుటుంబ సభ్యుల సందర్శనలు, కమ్యూనికేషన్ సదుపాయాలు కూడా కల్పిస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హామీలు
మహారాష్ట్ర ప్రభుత్వం, జైలు అధికారులు కలిసి రూపొందించిన ఈ సమగ్ర హామీలను యూరోపియన్ మానవ హక్కుల ఒప్పందంలోని ఆర్టికల్ 3 ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘనలు జరగకుండా కట్టుబాట్లుగా ప్రకటించింది. సిబ్బందికి క్రమం తప్పని శిక్షణా కార్యక్రమాలు, మానవ హక్కుల కమిషన్ తనిఖీలు, న్యాయ పర్యవేక్షణ వంటి రక్షణ చర్యలు అమలులో ఉంటాయి.
చోక్సీపై నేర ఆరోపణలు
రూ.13,000 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన పీఎన్‌బీ స్కామ్‌లో మెహుల్ చోక్సీ మరియు అతని మేనల్లుడు నీరవ్ మోడీ ప్రధాన నిందితులు. IPC సెక్షన్లు 120-B, 409, 420, 477A, 201 మరియు POCA, 1988లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెల్జియన్ కోర్టుల అనుమతి లభించిన తర్వాత ఈ హామీల ఆధారంగా చోక్సీని భారత్‌కు తీసుకువచ్చి విచారణ జరపనున్నారు.