Narendra Modi: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. భారత సైన్యం నిర్వహించిన ఈ దాడులు, ఉగ్ర శిబిరాలను ఛిద్రముచేసిన విధానం దేశ ప్రజల గుండెల్లో గర్వాన్ని నింపింది. ఈ విజయవంతమైన ఆపరేషన్ అనంతరం, ఇప్పుడు ఎన్డీఏ ,నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA)కీలక సమావేశం నిర్వహించనుంది.
ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీ లో ఈ భేటీ జరగనుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందులో పాల్గొననున్నారు. ఉగ్రవాదంపై కేంద్రం తీసుకున్న ఆపరేషన్, తదనంతర పరిణామాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నట్లు సమాచారం.
ప్రధాని మోదీ, ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్ వెనుక ఉన్న ఉద్దేశాలను, దాని విజయాన్ని, ఉగ్రవాదంపై తీసుకున్న చర్యల దృఢతను నేతలకు వివరించనున్నారు. జాతీయ సమైక్యత, సైనికుల ధైర్యసాహసాలు, దేశ భద్రతపై ప్రభుత్వ కట్టుబాటు వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.
ఇదే సందర్భంలో, ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఎదురవుతున్న విపక్ష విమర్శలకు ప్రతిస్పందనగా సమావేశాన్ని వినియోగించనున్నారు. ప్రభుత్వ ధోరణిపై ఎన్డీఏలోని నేతలకు స్పష్టత కల్పించి, ఏకతాటిపై నిలబడేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: BSF jawan: భారత బీఎస్‌ఎఫ్ జవాన్‌ను అప్పగించిన పాక్..!
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని సమాచారం. రాజకీయ ప్రకటనల దూరంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర మంత్రులకు సూచనలు ఇచ్చిన ప్రధాని, ఈ సమావేశంలో కూడ అదే దృక్కోణాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.
బీజేపీ నేతలు మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్ విజయానికి కీర్తి మొత్తం భారత సైన్యానిదే. ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పే చర్యలు కొనసాగుతాయి” అని స్పష్టం చేశారు.
దేశ భద్రతకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష విమర్శలకు సరైన సమాధానం ఇవ్వడంలో కూడ తడబడదన్న సంకేతాలు ఈ సమావేశం ద్వారా వెలువడే అవకాశముంది. మొత్తం మీద, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎన్డీఏ కీలక భేటీ దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కేంద్రబిందువుగా మారింది.