PM MODI: కేరళలో అదానీ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విఝింజం అంతర్జాతీయ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, పోర్టు నిర్మాణంలో అదానీ గ్రూప్ పనితీరును, ప్రత్యేకంగా గౌతమ్ అదానీని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా పోర్టు నిర్మాణాన్ని, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పోర్టు నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించిన ప్రధాని, అదే సమయంలో గుజరాత్‌ను ప్రస్తావిస్తూ సరదాగా చేసిన వ్యాఖ్యలు సభికులను నవ్వించారు.
పోర్టును సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “నేను ఇప్పుడే పోర్టును చూసి వస్తున్నాను. అదానీ దీన్ని అత్యద్భుతంగా నిర్మించారు. నిజంగా, ఇంత గొప్ప పోర్టును నేను ఇప్పటివరకు చూడలేదు” అని అన్నారు.
వెంటనే సరదాగా, “గౌతమ్ అదానీ గుజరాత్‌లో దాదాపు 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారు, కానీ అక్కడ ఇలాంటి పోర్టును నిర్మించలేదు” అని వ్యాఖ్యానించారు. ఈ మాట విన్న సభికులు నవ్వుల పంట పండింది. దీనిపై మోదీ కొనసాగిస్తూ, “నేను ఇలా అన్నానని గుజరాత్ ప్రజలు ఆయనపై (అదానీపై) కోప్పడతారేమో!” అని సరదాగా అన్నారు. ఈ వ్యాఖ్యతో వాతావరణం మరింత హాస్యాస్పదంగా మారింది.

