Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొంథా తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలబడ్డారు. తుఫాను తాకిడికి గురైన కాకినాడ జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలు చేపట్టడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. నిత్యావసర వస్తువులు, నగదు పంపిణీని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా, అధికారులు వెంటనే క్షేత్ర స్థాయిలో పర్యటించి, పంట నష్టంపై ఒక పకడ్బందీ నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Also Read: Telangana: ఉద్యోగులకు శుభవార్త.. బకాయిలు, బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వం
వీడియో కాన్ఫరెన్స్‌లో కాకినాడ జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తుఫాను తర్వాత చేయాల్సిన పనులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారికి దిశానిర్దేశం చేశారు. పంట నష్టం, ఆస్తి నష్టాల అంచనాలను కచ్చితంగా తయారు చేయాలని సూచించారు. తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.
తన నియోజకవర్గం అయిన పిఠాపురంలో పరిస్థితిని కూడా ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఏలేరు కాలువ గట్టును పటిష్టం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, మల్లవరం ప్రాంతంలోని పత్తి రైతులకు న్యాయం చేయాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. తుఫాను బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.


