Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్థానికంగా శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. ఇటీవల పిఠాపురంలో జరుగుతున్న చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో భూతద్దంలో చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. “పిఠాపురంలో కాకి ఈక రాలినా ఏదో జరిగిపోయిందంటూ వైరల్ చేస్తున్నారు.. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలి” అని ఆయన హితవు పలికారు.
పిఠాపురంలో నిర్వహించిన ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల’ వేదికగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఇక్కడ బూతులు తిట్టడం, అక్రమ కేసులు పెట్టడం వంటి సంస్కృతిని మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి గొడవలు చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోనని, అరాచక శక్తులను ఏరివేస్తానని గట్టిగా హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.
సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. ఈ వేడుకలు కేవలం కోడిపందేలు, జూదానికే పరిమితం కాకూడదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పిఠాపురం ఒక పవిత్రమైన శక్తిపీఠమని, శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన నేల అని గుర్తు చేస్తూ.. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఆడపడుచులను కూడా పిఠాపురానికి ఆహ్వానించి, గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని వారికి రుచి చూపించాలని పిలుపునిచ్చారు.
చివరగా, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం ఎంతో అవసరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కూటమి నేతలెవరూ పొత్తులను బలహీనపరిచేలా మాట్లాడవద్దని సూచించారు. తాను అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని, తనను మరింత బలోపేతం చేస్తే ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
