PAWAN KALYAN:ఆంధ్రప్రదేశ్‌లో రోహింగ్యాల అక్రమ వలసలు రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను తగ్గించడమే కాకుండా, దేశ భద్రతకు కూడా పెద్ద ముప్పుగా మారుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కొంతమంది ప్రభుత్వ అధికారుల సహకారంతో రోహింగ్యాలు రాష్ట్రంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, వారికి సులభంగా ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు కూడా లభిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2017-18 మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుంచి బంగారం రంగంలో పని చేయడం కోసం రోహింగ్యాలు ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద ఎత్తున వలస వచ్చారని తెలిపారు. దీంతో స్థానిక యువతకు నష్టం జరుగుతోందని, వారికి దక్కాల్సిన ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి వెలుపల నుంచి వచ్చిన వారికి ఎలా గుర్తింపు కార్డులు లభిస్తున్నాయన్న దానిపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అక్రమ చర్యలకు తోడ్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు.