Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ అధినేత జగన్‌పై సూటిగా వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. “బహుశా వైసీపీకి వేరే రాజ్యాంగం ఉన్నట్టుంది, కానీ అది మా ప్రభుత్వంలో చెల్లదు” అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఎస్‌డీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించనున్నట్లు వెల్లడించారు.
“ఎన్ఎస్‌డీ ఒక చిన్నపాటి భారతదేశంలాంటిది. నన్ను నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యమూర్తి గారు ఈ సంస్థ గొప్పతనాన్ని ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు” అని పవన్ గుర్తుచేసుకున్నారు. సమాజంలో కళలకు తగిన ప్రోత్సాహం లేకపోతే హింస పెరిగే ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నదని, సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. “ఇండస్ట్రీకి అవసరమైన సౌకర్యాలు, రాయితీల కోసం తగిన కార్యాచరణను రూపొందిస్తున్నాం” అని ఆయన వివరించారు.
అంతకుముందు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. అపార అనుభవజ్ఞుడైన రాధాకృష్ణన్ నేతృత్వంలో రాజ్యసభలో అర్థవంతమైన చర్చలు సాగుతాయని, ఉపరాష్ట్రపతి పదవికి ఆయన మరింత గౌరవాన్ని తీసుకువస్తారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.