Pawan Kalyan: అమరావతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన 9 మంది జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ వన్ టూ వన్ భేటీ అవుతున్నారు. ప్రతి ఎమ్మెల్యేతో 30 నిమిషాలకు పైగా ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తూ నియోజకవర్గ పరిస్థితులపై లోతుగా చర్చిస్తున్నారు.
ఈ సమావేశాలకు ముందు ఆయా నియోజకవర్గాలపై వివరమైన రిపోర్టులను పవన్ కళ్యాణ్ తెప్పించుకున్నట్లు సమాచారం. ఆ రిపోర్టుల ఆధారంగానే ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ, ప్రజల్లో పార్టీ ఇమేజ్, అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రశ్నలు వేస్తున్నారు.
ఈ సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని, ఇచ్చిన హామీల అమలులో వేగం పెంచాలని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో పార్టీకి ఇబ్బంది కలగకుండా పనితీరును మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై మరింత గట్టి పర్యవేక్షణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

