Sigachi Industries: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో ఉన్న పాశామైలారం పారిశ్రామిక వాడలో నిన్న జరిగిన ఘోర రసాయన పేలుడు రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచింది. సిగాచి ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో ఉదయం 9:18 గంటల సమయంలో మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది.
పేలుడు తాలూకూ భయంకర దృశ్యాలు
పేలుడు ధాటికి మంటలు దాదాపు 100 మీటర్ల ఎత్తుకి ఎగిసిపడ్డాయి. రెండు కిలోమీటర్ల దూరం వరకూ శబ్దం వినిపించడంతో గ్రామస్థులు భూకంపమో ఏదో అనుకుని భయాందోళనకు గురయ్యారు. మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా పొగమయం అయింది. అంతటి ఉష్ణోగ్రత (సుమారు 700–800 డిగ్రీల సెల్సియస్) కారణంగా పలువురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రాణనష్టం – ఇంకా పెరిగే అవకాశమే
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 42 మంది మృతి చెందగా, గాయపడిన 33 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. 20 మంది కార్మికులు ఇంకా కనిపించకుండా పోయారు. కొన్ని శవాలు పూర్తిగా కాలిపోవడం వల్ల గుర్తించలేని స్థితిలో ఉన్నాయి.
విధుల్లో ఉన్నవారికి ఘోరాంత్యం
ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 118 మంది కార్మికులు, 32 మంది అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, 3 మంది సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. మేనేజర్ ఎల్‌ఎన్ గోవన్ కూడా ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఆయన రెండు రోజుల క్రితమే విధుల్లో చేరారు.
ఇది కూడా చదవండి: Srisailam Laddu Prasadam: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక.. బయటకొచ్చిన సీసీటీవీ దృశ్యాలు
రాత్రి వర్షం.. సహాయక చర్యలకు ఆటంకం
ప్రమాదానికి తక్షణం స్పందించిన ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కానీ రాత్రి పడిన భారీ వర్షం రిస్క్యూ పనులను కొంతకాలం అడ్డగించింది. ఉదయం మళ్లీ పరిస్థితి కొద్దిగా కుదురుకోవడంతో, మృతదేహాల వెలికితీత కొనసాగిస్తున్నారు. సింగరేణి బృందం సహాయక చర్యల్లో భాగంగా పనిచేస్తోంది.
ప్రభుత్వాల స్పందన
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారాన్ని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేయనున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్, వివేక్‌లతో కలిసి ధ్రువ హాస్పిటల్‌లో బాధితులను పరామర్శించనున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ఈ ప్రమాదానికి కారణం పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి పెద్దగా చర్చ మొదలైంది.
సంపూర్ణంగా మూసివేసిన పరిశ్రమ
ప్రమాదం తర్వాత పరిశ్రమను పూర్తిగా మూసివేశారు. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలను కూడా తాత్కాలికంగా నిలిపేశారు. విషపూరిత వాయువుల వల్ల స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.