Delhi: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో రాజధాని నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాఠశాలలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని దుండగుల నుంచి ఈ-మెయిల్స్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు వెంటనే విద్యార్థులను ఇళ్లకు పంపించాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు, అగ్నిమాపక శాఖ బృందాలు బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్, జిడి గోయెంకా స్కూల్, ద్వారక ఇంటర్నేషనల్ స్కూల్, గురునానక్ పబ్లిక్ సావరిన్ స్కూల్, రోహిణిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్‌లోని రిచ్‌మండ్ స్కూల్ వంటి 20కి పైగా పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. అభినవ్, రిచ్మండ్ గ్లోబల్ స్కూళ్లలో పేలుడు పదార్ధాలు ఉన్నాయని దుండగులు మెయిల్స్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Also Read: Mitchell Starc: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఈ వారంలో ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి అని అధికారులు వెల్లడించారు. వరుసగా వస్తున్న ఈ బెదిరింపులు దేశ రాజధానిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.