Oscar 2025: లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్స్ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అయితే గురువారం నామినేషన్స్ జాబితాను అకాడెమీ బృందం ప్రకటించింది. గునీత్ మోంగా నిర్మించిన ‘అనూజ’ లఘు చిత్రం లైవ్ యాక్షన్ విభాగంలో బరిలో నిలిచింది. ఈ షార్ట్ ఫిల్మ్ కు ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ళ అమ్మాయి జీవితం చుట్టూ ‘అనూజ’ కథ సాగుతుంది. ఇదిలా ఉంటే… 23 విభాగాల్లో వెల్లడించిన జాబితాలో జాక్వెస్ ఆడియార్డ్ డైరెక్ట్ చేసిన మ్యూజికల్ క్రైమ్ మూవీ ‘ఎమిలియో పెరెజ్’ ఉత్తమ దర్శకుడుతో సహా పలు విభాగాల్లో అత్యధిక నామినేషన్స్ ను దక్కించుకుంది. ఆ తర్వాత వార్ డ్రామ్ ‘ది బ్రూటలిస్ట్’కు అత్యధిక నామినేషన్స్ దక్కాయి. వీటితో పాటు ‘అనోరా, ది సబ్ స్టాన్స్, కాన్ క్లేవ్, ఐయామ్ స్టిల్ హియర్’ చిత్రాలకు పలు విభాగాల్లో నామినేషన్స్ లభించాయి. మరి వీటిలో ఏ యే చిత్రాలు విజేతగా నిలుస్తాయనేది మార్చి 2న జరిగే బహుమతి ప్రదానోత్సవంలో తెలుస్తుంది.
