ONGC: కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ (ONGC) బావిలో చెలరేగిన గ్యాస్ బ్లోఅవుట్ మంటలు రెండో రోజు కూడా అదుపులోకి రాలేదు. సోమవారం మధ్యాహ్నం మోరి–5 బావిలో రిపేర్ పనులు జరుగుతుండగా అధిక పీడనంతో గ్యాస్, ముడి చమురు ఒక్కసారిగా బయటకు చిమ్మి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో పరిసర గ్రామాల్లో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది.
మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు, అగ్నిమాపక సిబ్బంది నిరంతరంగా శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని బావిని చల్లబరిచే పనులు కొనసాగుతున్నాయి. నీరు, మట్టితో మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతుండగా, రెండు లారీల్లో కూలెంట్‌ను తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నారని సమాచారం.
ఈ ఘటన నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా ఇరుసుమండ, మోరి గ్రామాలకు చెందిన సుమారు 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఘటన స్థలంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తామని వారు స్పష్టం చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
