Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో, ఒక వ్యక్తి తన ప్రియురాలినే అతికిరాతకంగా హత్య చేశాడు. కేవలం చంపడమే కాకుండా, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడేసిన ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
ప్రేమ పేరుతో ఘాతుకం వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన మింకీ శర్మ (32) ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తోంది. అదే ఆఫీసులో వినయ్ సింగ్ అనే వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, ఇటీవల మింకీ తన పెళ్లి ప్రతిపాదనను కాదనడంతో వినయ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. దీనికి తోడు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానం కూడా అతనిలో కసిని పెంచింది.
పథకం ప్రకారం హత్య జనవరి 23న మింకీ ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అదే రోజు వినయ్ ఆమెను కలుసుకుని గొడవ పడ్డాడు. ఆవేశంలో ఆమెను చంపేసి, ఎవరికీ దొరక్కుండా ఉండాలని మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. తలను మొండెం నుంచి వేరు చేసి, ఆ భాగాలను గోనె సంచుల్లో నింపి యమునా నది వంతెన పైనుంచి పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తన పనుల్లో నిమగ్నమయ్యాడు.
పోలీసుల వేటలో దొరికిన నిందితుడు మింకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు జవహర్ వంతెన వద్ద తల లేని మొండెం లభ్యమైంది. ఆఫీస్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, వినయ్ సింగ్ ఒక భారీ సంచిని స్కూటర్ మీద తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. దీని ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తనే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు మిగిలిన శరీర భాగాల కోసం గాలిస్తున్నారు.
