King 100: టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ల్యాండ్‌మార్క్ చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తుండగా, దీనికి ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ వంటి చిత్రాలతో బిజీగా గడిపిన నాగ్, ఇప్పుడు తన వందో సినిమాను చాలా ప్రత్యేకం కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సీనియర్ నటి టబు నటించబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నాగార్జున స్వయంగా ఈ విషయంపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టబు తనకు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే తెలుసని, తమ మధ్య దశాబ్దాల కాలంగా ఎంతో మంచి స్నేహం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. నాగార్జున వందో సినిమా చేస్తున్నారని తెలియగానే, ఆ మైలురాయి చిత్రంలో తాను కూడా భాగం కావాలని టబు స్వయంగా కోరారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోబోతుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. అయితే ఈ సినిమాలో వారిద్దరూ రొమాంటిక్ జంటగా కాకుండా, కథను మలుపు తిప్పే ఒక బలమైన పాత్రలో టబు కనిపించే అవకాశం ఉందని సమాచారం.
Also Read: Border 2: బోర్డర్ 2 బాక్సాఫీస్ ఊచకోత.. మేకర్స్ బిగ్ అప్డేట్!
సినిమా మేకింగ్ గురించి నాగార్జున మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందని, అందుకే ఈ చిత్రాన్ని అత్యంత సహజంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల విషయంలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పై ఆధారపడకుండా, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా రియల్ స్టంట్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు కథానాయికలు ఉండే అవకాశం ఉందని, నాగార్జున లుక్ గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో విడుదల తేదీని కూడా ఇప్పటికిప్పుడు ప్రకటించడం లేదని నాగ్ స్పష్టం చేశారు. త్వరలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
