Odisha:

Odisha: ఒడిశాలో అమాన‌వీయ ఘ‌ట‌న‌.. కులాంత‌ర వివాహం చేసుకున్నద‌ని యువ‌తి కుటుంబానికి దారుణ‌మైన శిక్ష‌!

Odisha:ఇది స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే అమానుష‌ ఘ‌ట‌న‌. దేశంలో ఇంకా క‌ట్టుబాట్లు, కుల దుర‌హంకారం, మ‌త మౌఢ్యం మాసిపోలేద‌న‌డానికి నిద‌ర్శ‌నం. తోటి మ‌నిషిని మ‌నిషిగా చూడ‌లేని స‌మాజం ఏదైనా ఉన్న‌దంటే.. అది భార‌త‌దేశ‌మే అని చెప్పుకునే దౌర్భ్యాగ్య దుస్థితి ఇది. కులాంత‌వ‌ర వివాహం చేసుకున్నందుకు ఓ యువ‌తి కుటుంబ స‌భ్యుల‌కు గ్రామ పెద్ద‌లు విధించిన దారుణ‌, మారుణ శిక్ష ఇది.

Odisha:స‌మాజం ఆధునిక‌త వైపు ప‌య‌నిస్తున్న‌ది. అంత‌రిక్షాల‌ను అవ‌లీల‌గా చేరుకోగ‌లుగుతున్న‌ది. సాంకేతిక ప‌రిజ్ఞానం ప‌రుగులు పెడుతున్న కాల‌మిది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒడిశాలోని ఓ మారుమూల ప‌ల్లె మాత్రం కుల క‌ట్టుబాట్లు, మ‌త ఆచారాలు అంటూ మ‌డిక‌ట్టుకొని కూర్చున్న‌ది. అవి కాదంటే తామిచ్చే తీర్పున‌కు క‌ట్టుబ‌డాల్సిందేన‌ని హెచ్చ‌రిస్తున్న‌ది. వారిచ్చిన ఆ తీర్పు స‌భ్య‌స‌మాజాన్నే ప్ర‌శ్నిస్తున్న‌ది.

Odisha:ఒడిశా రాష్ట్రంలోని రాయ‌గ‌డ జిల్లా గోర‌ఖ్‌పూర్ పంచాయ‌తీ ప‌రిధిలోని ఓ గ్రామంలో షెడ్యూలు కులానికి చెందిన యువ‌కుడు, ఓ ఆదివాసీ యువ‌తి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల‌ని వారిద్ద‌రూ నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని వారి ఇరు కుటుంబాల్లో చెప్పుకున్నారు. ఒప్పించాల‌ని భావించారు. కానీ, ఈ విష‌యం తెలిసిన యువ‌తి కుటుంబ స‌భ్యులు వారి పెళ్లికి అంగీక‌రించ‌లేదు.

Odisha:పెళ్లి చేసుకోవాల‌నే కృత నిశ్చ‌యంతో ఉన్న ఆ ప్రేమ జంట.. మూడు రోజుల క్రితం పారిపోయారు. పెళ్లి చేసుకొన్న ఆ ప్రేమ జంట తిరిగి గ్రామానికి వ‌చ్చింది. ఈ విష‌యం గ్రామ పెద్ద‌ల‌కు తెలియ‌డంతో గ్రామ క‌ట్టుబాట్ల ప్ర‌కారం, యువ‌తి కుటుంబ స‌భ్యుల‌ను గ్రామం నుంచి వెలివేశారు. ఆ శిక్ష నుంచి త‌ప్పించుకోవ‌డానికి మ‌రో శిక్ష‌ను గ్రామ పెద్ద‌లు తీర్మానం చేశారు.

Odisha:గ్రామ బ‌హిష్క‌ర‌ణ శిక్ష నుంచి త‌ప్పించుకోవ‌డానికి శిరోముండ‌నం చేయించుకొని, మూగ‌జీవాల‌ను బ‌లిచ్చి, ప్రేమ జంట‌కు పెద్దక‌ర్మ చేయాలి. గ్రామ పెద్ద‌లు ఇచ్చిన ఈ తీర్పు మేర‌కు చేసిన యువ‌తి కుటుంబ స‌భ్యులైన‌ 40 మందికి శిరోముండ‌నం చేయించారు. మూగ‌జీవాల‌ను బ‌లిచ్చి, ప్రేమ జంట‌కు పెద్ద క‌ర్మ చేశారు. ఈ ఘ‌ట‌న బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌డంతో క‌లక‌లం రేగింది. క‌ట్టుబాట్ల పేరుతో దారుణ‌మైన తీర్పునిచ్చిన కులపెద్ద‌ల‌పై ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై వివ‌రాలు అడిగితే త‌మ‌కు ఎలాంటి స‌మాచారం అంద‌లేద‌ని పోలీసులు వివ‌ర‌ణ ఇచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *