NTR: విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారకరామారావుగా వేనోళ్ల కొనియాడబడిన ఎన్టీఆర్ నట జీవిత ఆరంభానికి ఈ ఏడాదితో 75 ఏళ్లు నిండాయి. రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా, పోతులూరి వీరబ్రహ్మంగా పౌరాణికంలో ఏ వేశం వేసినా ఆయనకు ఆయనే సాటి. గజదొంగ, సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి, చండశాసనుడు లాంటి సాంఘిక చిత్రాల్లో ప్రేక్షకులను కట్టిపడేసే నటన. అంతటి మహానటుడికి తెలుగు ప్రజలు నీరాజనం పలికారు.
NTR: ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఆయనొక ట్రెండ్. సినీ రంగంలో, రాజకీయ రంగంలో రెండింటిలోనూ ఆయన టాప్ పొజిషన్ కొనసాగారు. ప్రజల ఆదరాభిమానాలను పొందారు. అలాంటి మహోన్నతుడు తెలుగు ప్రజలకు ఎప్పటికీ ఆరాధ్యుడిగానే ఉంటారు. ఈ ఏడాదికి ఆయన సినీ జీవితప్రయాణం 75 ఏళ్లు నిండిన సందర్భంగా తెలుగు ప్రజలు వజ్రోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
NTR: 75 ఏళ్లు నిండిన సందర్భంగా విజయవాడ వేదికగా ఈనెల 14న వజ్రోత్సవాలను నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబ సభ్యులు హాజరవుతారు. అదే విధంగా అక్కినేని, చిరంజీవి కుటుంబాల నుంచి కొందరు ముఖ్యులు హాజరవుతారు. వీరేకాక సినీ నిర్మాతలు, ఇతర సినీ, రాజకీయ, ఇతర వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
NTR: త్వరలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలను అన్ని భాషల్లో విడుదల చేసేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చేందుకు ప్రభుత్వాలను సంప్రదించనున్నట్టు వెల్లడించారు. సినీ, రాజకీయ రంగాల్లో మకుటం లేని మహరాజుగా వెలుగొందిన ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు.