Dating App: చదువుకున్న వాళ్ళు.. చదువు లేని వారు అనే తేడా ఏమీ లేదు.. డబ్బు విషయంలో మోసపోవడానికి. అన్నీ తెలిసినా ఎదో ప్రలోభంతో లక్షలు.. కోట్లు పోగొట్టుకుని ఆనక లబోదిబో మానడం పరిపాటిగా మారింది. ప్రతిరోజూ ఇలాంటి వార్తలు పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైనా గర్ల్ ఫ్రెండ్ కోట్లు కొల్లగొట్టడంతో షాక్ అయ్యాడు ఒక యువకుడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దల్జీత్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందినవాడు. అతను ఒక వ్యాపారవేత్త. అతనికి ఢిల్లీలో ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది. కొంతకాలం క్రితం తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న అతనికి ఒక స్నేహితుడు డేటింగ్ యాప్ లో గర్ల్ ఫ్రెండ్ ను వెతుక్కోమని సలహా ఇచ్చాడు. దీంతో ఒక డేటింగ్ యాప్ లో యాక్టివ్ గా మారాడు. ఈ క్రమంలో అతనికి హైదరాబాద్ కు చెందిన అనిత అనే అమ్మాయితో యాప్ లో పరిచయం అయింది. ఆ పరిచయం మరింతగా ముందుకు వెళ్లేలా గాఢ స్నేహంగా మారింది.
వీరిద్దరి స్నేహం ఎంత ముదిరిందంటే.. అనిత ఏమి చెప్పినా నమ్మేటంతగా దల్జీత్ సింగ్ మారిపోయాడు. సరిగ్గా ఈ పాయింట్ ఆధారంగా చేసుకుని అనిత అతనితో గేమ్ ఆడింది. ఆన్ లైన్ ట్రేడింగ్ ద్వారా డబ్బులు బాగా సంపాదించవచ్చని ఆమె చెప్పింది. ముందు 24 వేల రూపాయలు పెట్టుబడి పెట్టించింది. రెండు రోజుల్లో అది 3.2 లక్షల రూపాయల రాబడి ఇచ్చింది. అంతే కాకుండా ఆమెకు వచ్చిన లాభాల నుంచి కూడా 8 వేల రూపాయలు అతనికి వచ్చాయి. దీంతో ఇది లాభసాటిగా ఉందని భావించాడు దల్జీత్ సింగ్. పైగా అనిత మీద మరింత నమ్మకం పెరిగింది.
ఇది కూడా చదవండి: Delhi Flyovers: షాకింగ్ . . ఢిల్లీలో భూకంపం వచ్చిందంటే 72 ఫ్లై ఓవర్లు కూలిపోతాయి.. ఎందుకంటే . .
తాను అప్పటివరకూ దాచుకున్న 4.5 కోట్ల రూపాయలతో పాటు.. మరో రెండు కోట్లు అప్పు చేసి మరీ అనిత చెప్పిన యాప్స్ లో పెట్టుబడి పెట్టాడు. అంత చెప్పిన విధంగా 25 బ్యాంక్ ఎకౌంట్స్ కు ఆ డబ్బును పంపించాడు. ఆ తరువాత తన డబ్బును విత్ డ్రా చేసుకుందామని ప్రయత్నిస్తే తాను పెట్టుబడి పెట్టిన మూడు వెబ్సైట్స్ లో రెండు పనిచేయలేదు. అనిత కోసం ప్రయత్నిస్తే ఆమె దొరకలేదు. దీంతో తాను మోసపోయానని అర్ధం అయినా దల్జీత్ పోలీసులను ఆశ్రయించాడు. దిల్జీత్ సింగ్ నోయిడా సెక్టార్-36లోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో, అనిత డేటింగ్ యాప్ ప్రొఫైల్ నకిలీదని తేలింది. డబ్బు బదిలీ అయిన ఎకౌంట్స్ గురించి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అదండీ విషయం. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని తెలుసుకోకుండా.. రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేస్తాయని ఎగేసుకుంటూ వెళితే ఇలాగే జరుగుతుంది. పోలీసులు, ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ఇలాంటి నేరాలు జరగడానికి కారణం అత్యాశే అని చెప్పక తప్పదు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించకపోతే ఇలానే సైబర్ నేరగాళ్లకు చిక్కాల్సి వస్తుంది.
