వైద్యశాస్త్రంలో విషేశ కృషి చేసిన ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. 2024 ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో వీరిద్దరు ఈ బహుమతిని గెలుచుకున్నారని అవార్డు ప్రదాన సంస్థ నోబెల్ బృందం వెల్లడించింది.
సోమవారం స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ మెడికల్ యూనివర్శిటీలోని నోబెల్ బృందం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించింది. జన్యు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న RNA అణువుల కొత్త తరగతిని వీరు కనుగొన్నట్లు తెలిపింది. గ్రహితలకు11 మిలియన్ స్వీడిష్ కిరీటాలు బహుమతిగా అందుకుంటారని చెప్పింది.
కాగా, ప్రతి సంవత్సరం మాదిరిగానే, వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్14 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటించనున్నారు.ఇక, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో విజేత పేర్లను వెల్లడించనున్నారు. స్వీడిష్ డైనమైట్ ఆవిష్కర్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద రూపొందించబడిన ఈ బహుమతులు 1901 నుండి సైన్స్, సాహిత్యం, శాంతిలో విషేశంగా కృషి చేసిన వారికి అందించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆర్థికశాస్త్రంలోనూ ఈ బహుమతులను ప్రకటిస్తున్నారు.