Malla Reddy

Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్

Malla Reddy: నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మల్లారెడ్డిపై గత కొంతకాలంగా తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కదలికలపై నిఘా ఉంచిన ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు.. మంగళవారం తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగాయి. నిజామాబాద్‌లోని ప్రగతి నగర్ నివాసం, సుభాష్ నగర్ లోని ఆఫీసుతో పాటు హైదరాబాద్ మచ్చబొల్లారంలోని ఇల్లు, బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 11 ప్రాంతాలలో ఒకేసారి సోదాలు నిర్వహించారు.

బయటపడ్డ అక్రమాస్తుల సామ్రాజ్యం:

గత ఆరేళ్లుగా నిజామాబాద్‌లోనే తిష్టవేసిన మల్లారెడ్డి.. ఎక్సైజ్ శాఖను అడ్డుపెట్టుకుని భారీగా వెనకేసినట్లు ఏసీబీ ప్రాథమిక తనిఖీల్లో తేలింది. ఈ దాడుల్లో గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • స్థిరాస్తులు: అధికారుల తనిఖీల్లో 4 విలాసవంతమైన ఇళ్లు, ఒక కమర్షియల్ భవనం, 8 ఓపెన్ ప్లాట్లతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న 10.23 ఎకరాల విలువైన వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

  • నగదు, డిపాజిట్లు: ఇళ్లలో దొరికిన రూ.3.30 లక్షల నగదుతో పాటు బ్యాంకుల్లో ఉన్న రూ.50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను అధికారులు తక్షణమే ఫ్రీజ్ చేశారు.

  • బ్యాంక్ లాకర్లు: మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్ల మీద వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న 3 కీలకమైన బ్యాంక్ లాకర్లను అధికారులు గుర్తించారు. వీటిని తెరిస్తే మరిన్ని అక్రమాస్తులు, బంగారం బయటపడే అవకాశం ఉంది.

హైదరాబాద్‌కు తరలింపు – కోర్టులో హాజరు:

సోదాల అనంతరం అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మల్లారెడ్డిని నిజామాబాద్‌లో అదుపులోకి తీసుకుని నేరుగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనను నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు ఏసీబీకి దొరికిపోతున్న ఘటనలు తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *