గత ఐపీఎల్ సీజన్ లో చాన్స్ దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆల్ రౌండర్ గా బరిలోకి నితీశ్.. ముఖ్యంగా తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేయడంతో ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ కు సెలక్ట్ అయ్యాడు. తాజాగా మరో అవకాశం నితీశ్ ను వరించింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌కు నితీశ్‌కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు.
పేస్ ఆల్‌రౌండర్ లోటును భర్తీ చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ నితీశ్ వైపు మొగ్గుచూపింది. ఈక్రమంలో తనకు ఆడే అవకాశం వస్తే ‘బెస్ట్ ఆల్‌రౌండర్’ నాణ్యమైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని నితీశ్ పేర్కొన్నాడు. తాజాగా ఆసీస్ టెస్టు సిరీస్ కు ఎంపికవ్వడంపై మీడియాతో నితీశ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆసీస్‌పై ఆడాలనేది తన చిన్నప్పటి కల అని తెలిపాడు. గౌతమ్ గంభీర్, హార్దిక్ పాండ్య ఇచ్చిన కీలక సూచనలపై స్పందించాడు.
‘బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన నేను రివర్స్ స్వీప్ షాట్ కొట్టా. అయితే, కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచనలు చేశాడు. ‘నీకు మంచి పవర్ ఉంది. సులువుగానే బౌండరీలు కొట్టగలవు’ అని చెప్పి నా బలం ఏంటో తెలియజేశాడు. అనవసరమైన ఒత్తిడిని తీసుకోవద్దని, ఐపీఎల్‌లో ఎలా ఆడావో.. అదేతరహాలో దేశం కోసం ఆడితే సరిపోతుందని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. హార్దిక్ పాండ్య నుంచి కూడా విలువైన సలహాలు అందాయి. ఫిట్‌నెస్‌పై మరింత దృష్టిపెట్టాలన్నాడు. ఎలా బౌలింగ్ చేయాలనే దానిపై సూచనలు చేశాడు’ అని నితీశ్ చెప్పుకొచ్చాడు.

