Nitin gadkari: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తన సొంత మామ ఇంటినే తొలగించాల్సి వచ్చిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పని విషయంలో తనకు బంధువులు–బయటివారు అనే తేడా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్‌లో వెల్లడించారు. ఫరా ఖాన్ తన కుక్ దిలీప్‌తో కలిసి ఢిల్లీలోని గడ్కరీ నివాసాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
ఆ వ్లాగ్‌లో గడ్కరీ భార్య కాంచన్ మాట్లాడుతూ, రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందని తన తండ్రి ఇంటినే గడ్కరీ కూల్చివేశారని తెలిపారు. ఇది విన్న ఫరా ఖాన్ సహా అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఫరా ఖాన్, “మీ మామకు కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారా?” అని ప్రశ్నించగా, గడ్కరీ స్పష్టంగా స్పందించారు.
రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి ఎలా పరిహారం ఇస్తారో, అదే విధంగా తన మామకూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పరిహారం ఇచ్చామని గడ్కరీ తెలిపారు. పని విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని, చట్టం ముందు అందరూ సమానమే అన్నదే తన సిద్ధాంతమని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు పాలనలో న్యాయం, పారదర్శకతపై మరోసారి చర్చకు దారితీశాయి.
