Nitin gadkari: ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి, ఆ నిధులను పేదల సంక్షేమానికి వినియోగించడమే ప్రభుత్వ దార్శనికత అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జీఎస్టీ సహా ఇతర పన్నులను తగ్గించాలని కోరవద్దని పరిశ్రమ వర్గాలకు సూచించారు. ఒకసారి తగ్గిస్తే, మరింత తగ్గించమని కోరతారని, ఇది మనుషుల సహజ స్వభావమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందువల్ల పన్నులను తగ్గించాలని కోరవద్దని మంత్రి స్పష్టం చేశారు.
పేదల సంక్షేమం కోసం పథకాలను అమలు చేయాలంటే ప్రభుత్వానికి నిధులు అవసరమని గడ్కరీ తెలిపారు. పన్నులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, అది సాధ్యపడటం లేదని చెప్పారు. ఎందుకంటే, పన్నులు తగ్గిస్తే సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టతరమవుతుందని వివరించారు.
దేశంలో లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మరో రెండేళ్లలో ఈ వ్యయం 9 శాతానికి పరిమితమవుతుందని పరిశ్రమ వర్గాలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8 శాతం ఉంటే, అమెరికా, యూరోప్ దేశాల్లో అది 12 శాతం ఉందని చెప్పారు
భవిష్యత్తులో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు దిగుమతులను తగ్గించుకోవడం అవసరమని గడ్కరీ అన్నారు. మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చని తెలిపారు.