Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు సానుకూల ఫలితాలు సాధించకపోతే జట్టులో పెద్ద మార్పులు జరుగుతాయని తెలిసింది. రోహిత్ శర్మ తర్వాత టెస్ట్, వన్డే కెప్టెన్ ఎవరన్న విషయంపై క్రికెట్ వర్గాల్లో ఇప్పటికే తీవ్రంగా చర్చ సాగుతోంది. ఇప్పటికే అనేక పేర్లు వినిపిస్తున్నాయి. రోహిత్ వన్డేలకు వీడ్కోలు పలుకక ముందే దీనికి సంబంధించిన ఊహాగానాలు మొదలైపోయాయి. పైగా రోహిత్ ఆట తీరు చూస్తుంటే… అతను కెప్టెన్సీ కి స్వస్తి పలకడం రేపో మాపో అన్నట్లే ఉంది. అయితే ఎవరూ ఊహించని ఒక పేరు ఇప్పుడు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రోహిత్ కనుక కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటే వెంటనే వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ కే కెప్టెన్సీ ఇస్తారనుకున్నారు అందరూ. కానీ ఇటీవలి సమాచారం ప్రకారం, హార్దిక్ పాండ్య వన్డే కెప్టెన్ గా నియమితుడవుతాడని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు బాగా రాణిస్తే కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం జరుగుతుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్ గా నియమించాలనుకున్నారు, కానీ రోహిత్ శర్మ మరియు అజిత్ అగార్కర్ మాత్రం శుభ్మన్ గిల్ ను ఎంపిక చేశారు. అయితే టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ, అతడి ఫాం తగ్గింది. దీని వల్ల టీ20 కెప్టెన్సీ కూడా హార్దిక్ కు ఇవ్వడంపై చర్చ జరుగుతోందట. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శనపైనే కెప్టెన్సీ ఎవరికీ అప్పగించాలనేది ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: SL vs AUS: లంకలో సెంచరీలతో అదరగొడుతున్న ఆసీస్..! రెండో టెస్టులోనూ ఆధిపత్యమే…
రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు, అప్పుడు హార్దిక్ బాగా రాణిస్తే వన్డే కెప్టెన్సీ అతడికి ఇవ్వొచ్చు. శుభ్మన్ గిల్ డిప్యూటీగా ఉంటాడు. హార్దిక్ కు అన్యాయం జరిగిందనే భావన బీసీసీఐలోని అనేక మందికి ఉంది. దీని వల్ల పాండ్యకు వన్డే బాధ్యతలు ఇస్తారని అంటున్నారు.
కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే హార్ధిక్ పాండ్య తరచుగా గాయాల బారిన పడుతుంటాడు. కెప్టెన్ గా ఉండే మానసిక ఒత్తిడిని తట్టుకునే ఫిట్నెస్ అతని వద్ద ఉందా అనే అనుమానం కూడా చాలామందిలో ఉంది. పైగా అతను పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్. అది శారీరకంగా అదనపు ఒత్తిడి. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రెండు సీజన్లలో కెప్టెన్ గా అదరగొట్టాడు అయితే అతడిని గాయాలు మాత్రం వదిలిపెట్టట్లేదు. ఈ క్రమంలో బీసీసీఐ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందా అనేది తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.
ఇకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కీలక వన్డే సిరీస్‌లో భారత జట్టు బాగా రాణిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించారు. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరొక మూడు వికెట్ల రాణించారు.