Hyderabad: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఐడీ కార్డులతో కొందరు లోపలికి ప్రవేశించిన ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో సచివాలయ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఐడీ కార్డుల మార్ఫింగ్‌ను పూర్తిగా అడ్డుకునేలా అత్యాధునిక సాంకేతికతతో కూడిన కొత్త ఐడీ కార్డుల పంపిణీని నేటి నుంచి ప్రారంభించింది.
గత ఏడాది ఫిబ్రవరిలో ఫేక్ ఐడీ కార్డులతో ప్రైవేట్ వ్యక్తులు సచివాలయంలోకి ప్రవేశించి సెల్ఫీలు తీసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటనలతో భద్రతా లోపాలు స్పష్టమవ్వడంతో, పోలీసు శాఖ సిఫార్సుల మేరకు కొత్త తరహా సాంకేతిక ఐడీ కార్డులను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కొత్త ఐడీ కార్డుల్లో తెలంగాణ తల్లి విగ్రహం, సచివాలయం అధికారిక లోగో, ఉద్యోగి ఫోటో, ఎంప్లాయీ ఐడీ నంబర్‌తో పాటు, స్కాన్ చేయగానే తక్షణమే వివరాలు ధృవీకరించేలా QR కోడ్‌ను ఏర్పాటు చేశారు. అదనంగా ఇంటర్నల్ చిప్ (RFID టెక్నాలజీ)ను జత చేయడంతో, ఐడీ కార్డు మార్ఫింగ్ లేదా నకిలీ తయారీకి దాదాపు అవకాశం లేకుండా పోయింది.
ప్రస్తుతం సచివాలయంలో పనిచేస్తున్న సుమారు 1,300 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 300 మంది క్లాస్–4 ఉద్యోగులకు మొదటి దశలో ఈ కొత్త ఐడీ కార్డులను అందజేస్తున్నారు. త్వరలో మిగిలిన ఉద్యోగులకు కూడా పంపిణీ పూర్తిచేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను కూడా అమలులోకి తీసుకురావడంతో, సచివాలయ భద్రత మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తాజా చర్యలతో ఉద్యోగుల పేరుతో నకిలీ ఎంట్రీలు పూర్తిగా అడ్డుకట్ట పడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
