Nepal: నేపాల్ రాజధాని ఖాట్మండూలో చెలరేగిన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఖాట్మండూ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో భారతీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇందుకు సంబంధించి సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ – “ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా వెబ్‌సైట్ ద్వారా రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. పరిస్థితులు చక్కబడిన వెంటనే సేవలను పునరుద్ధరిస్తాం” అని తెలిపింది.
విమానాశ్రయం మూసివేతతో అనేక అంతర్జాతీయ విమానాలను లక్నో విమానాశ్రయానికి మళ్లించారు.
దుబాయ్ నుంచి బయల్దేరిన ఫ్లై దుబాయ్ (FZ539) విమానం మధ్యాహ్నం 3:25 గంటలకు లక్నోలో దిగింది.
బ్యాంకాక్ నుంచి వచ్చిన థాయ్ లయన్ ఎయిర్ (TLM220) విమానం మధ్యాహ్నం 3:05 గంటలకు ల్యాండ్ అయింది.
ఢిల్లీ నుంచి బయల్దేరిన ఇండిగో (6E1153) విమానం మధ్యాహ్నం 2:40 గంటలకు లక్నో చేరుకుంది.
ముంబై నుంచి బయల్దేరిన ఇండిగో (6E1157) విమానం మొదట లక్నోకు, ఆపై ఢిల్లీకి మళ్లించబడింది.
ప్రస్తుతం నేపాల్‌లో పరిస్థితులు స్థిరపడే వరకు విమాన రాకపోకలపై అనిశ్చితి కొనసాగనుంది. విమానయాన సంస్థలు పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.

