NEET Re-Exam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తర్వాత జరుగబోయే రీ-ఎగ్జామినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అత్యంత కఠినమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాయి. ఈ నెల 21న జరగనున్న నీట్ పునఃపరీక్షను పురస్కరించుకుని.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘టెలిగ్రామ్’ (Telegram) వేదికగా ఎలాంటి పేపర్ లీక్ మోసాలు, గ్రూప్ కాపీయింగ్ జరగకుండా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
టెలిగ్రామ్‌పై కేంద్రం సర్జికల్ స్ట్రైక్ – ఆంక్షలు ఇవే:
గతంలో చాలా రకాల పేపర్ లీకేజీల వ్యవహారాలు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారానే విస్తరించినట్లు ఆధారాలు ఉండటంతో, ఐటీ శాఖ ఈ క్రింది చర్యలు తీసుకుంది.
జూన్ 21న జరిగే పరీక్షను దృష్టిలో పెట్టుకుని.. ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేస్తూ (తాత్కాలిక నిషేధం) ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా, టెలిగ్రామ్‌లో పంపిన మెసేజ్‌లను మార్చే వెసులుబాటు లేకుండా.. ఈ నెల 30 వరకు టెలిగ్రామ్‌లోని ‘ఎడిట్ ఆప్షన్’ (Edit Option) ను పూర్తిగా తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనివల్ల పాత డేటాను మార్చి తప్పుడు ప్రచారాలు చేయడానికి వీలుండదు.
విద్యార్థులకు ఎన్టీఏ గుడ్ న్యూస్… పెరిగిన సమయం.
గత నెలలో జరిగిన నీట్ పరీక్ష రద్దయిన నేపథ్యంలో, ఈ నెల 21న జరిగే రీ-టెస్ట్ రాసే అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎన్టీఏ కొన్ని కీలక వెసులుబాట్లు కల్పించింది.
గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) మాత్రమే ఉండేది. కానీ తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 15 నిమిషాలు పెంచి.. 195 నిమిషాలకు (3 గంటల 15 నిమిషాలు) మార్చారు.
పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అలాగే బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ (Rough Work) చేసుకునేందుకు అదనంగా మరికొన్ని పేజీలను కూడా కేటాయించారు.
పేపర్ రక్షణకు ‘విమానాలు’ – దేశంలోనే తొలిసారి:
ఎన్టీఏ ఈసారి క్వశ్చన్ పేపర్ల లీకేజీకి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా స్ట్రాంగ్ రూమ్‌ల నుండి ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాల ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక విమాన సేవలను వినియోగించింది. భారతదేశ విద్యా పరీక్షల చరిత్రలోనే ఒక క్వశ్చన్ పేపర్ భద్రత కోసం ఎయిర్ సర్వీసెస్ వాడటం ఇదే మొదటిసారి కావడం విశేషం.
