NATS: ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబురాల కోసం సాంస్కృతిక సందడికి అంతా సిద్ధం చేశారు. అమెరికా ఫ్లోరిడాలోని టాంపాలో జూలై 4,5,6 తేదీల్లో జరిగే ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ప్రతినిధుల కోసం అన్నిరకాల ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. సాంస్కృతిక, వినోద కార్యక్రమాల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. వేడుకలకు హాజరయ్యే వారికోసం టికెట్ రేట్లను కూడా ప్రకటించారు.
సాంస్కృతిక, వినోద కార్యక్రమాల కోసం అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నారని వేడుకల నాట్స్ సమన్వయ కర్త గుత్తికొండ శ్రీనివాస్, బోర్డు చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి తెలిపారు. బ్యాంక్వెట్ విందు, శాస్త్రీయ సంగీతం, రాజకీయ, వైద్య, వ్యాపార విభాగాలకు చెందిన వైవిధ్యభరిత కార్యక్రమాలతో ఈ సంబురాలు ఉత్సాహంగా సాగుతాయని వారు తెలిపారు. ఈ వేడుకల్లో బుల్లితెర నటీనటులతో సాంస్కృతిక కార్యక్రమాలు, హీరోయిన్లతో నృత్య ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు.
ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు వీలుగా ఈ సంబురాల టికెట్ ధరలను అతి తక్కువగా నిర్ణయించినట్టు గుత్తికొండ శ్రీనివాస్, పిన్నమనేని ప్రశాంత్, మందాడి శ్రీహరి తెలిపారు. పెద్దలకు 75 డాలర్లు, 4 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకు 25 డాలర్లు, 3 అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలకు ఉచితంగా సంబురాలకు ప్రవేశం కల్పించనున్నట్టు వారు తెలిపారు. www.samburalu.org/buynow ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు.