Kailasagiri: విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిలో శనివారం నాడు భారీ ప్రమాదం తృటిలో తప్పింది. పర్యాటకులకు ఎంతో ఇష్టమైన టాయ్ ట్రైన్ బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ అయ్యాయి. కొండ చుట్టూ తిరుగుతున్న సమయంలో బ్రేకులు పని చేయకపోవడంతో, రైలు అదుపుతప్పి వెనక్కి పరుగెత్తడం మొదలుపెట్టింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో రైలులో సుమారు 100 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. రైలు వెనక్కి వెళ్తుండటంతో ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో అందరూ హాహాకారాలు చేశారు. అయితే, అదృష్టవశాత్తూ రైలు ఎక్కడా బోల్తా పడకుండా ఆగిపోవడంతో పర్యాటకులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అటు అధికారులు, ఇటు పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కైలాసగిరి అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. పర్యాటకుల నుంచి టిక్కెట్ల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్న నిర్వాహకులు, కనీసం రైలు కండిషన్‌ను కూడా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు.
విశాఖ వచ్చే పర్యాటకులు కచ్చితంగా సందర్శించే ప్రాంతం కైలాసగిరి. ఇక్కడి నుంచి సముద్ర తీరాన్ని చూడటం ఒక అద్భుత అనుభవం. అలాంటి చోట ఇలాంటి భద్రతా లోపాలు ఉండటం పర్యాటక రంగానికి తీరని నష్టం కలిగిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
