Narendra Modi: తన వల్ల ఎదురైన ఇబ్బందులకు మోదీ స్వయంగా వెళ్లి అక్కడ ఉన్న అందరికీ క్షమాపణలు చెప్పారు. దీనికోసం ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) ప్రోటోకాల్‌ను సైతం పీఎం పక్కన పెట్టారు. అసలు మోదీ క్షమాపణలు చెప్పింది ఎవరికో తెలుసా..?
అసలేం జరిగిందంటే: ఏప్రిల్ 23న నార్త్ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ ఏప్రిల్ 12, శనివారం బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకొని, అక్కడ నుండి సుమారు 13 కిలోమీటర్ల వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో అనంతరం శనివారం రాత్రి బస చేయడానికి సిలిగుడికి కొంత దూరంలో ఉన్న ‘మేఫెయిర్ టీ రిసార్ట్’లో ఏర్పాట్లు చేశారు.
ప్రధాని భద్రతను దృష్టిలో పెట్టుకొని శుక్రవారం నుండే హోటల్ చుట్టుపక్కల ప్రాంతమంతా సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో నార్త్ బెంగాల్‌కు చెందిన ఓ ప్రముఖ బిజినెస్‌మెన్ కొడుకు పెళ్లి అదే హోటల్‌లో జరుగుతోంది. దీంతో అక్కడికి వచ్చిన బంధువులకు తిప్పలు తప్పలేదు. లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించడం, వారి ప్రతి కదలికను గమనించడంతో అక్కడ ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదంతా గమనించిన మోదీ, స్వయంగా అక్కడికి వెళ్లి తన వల్ల ఎదుర్కొంటున్న అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. అనంతరం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని ఆశీర్వదించారు.
