AP NEWS: సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు శనివారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. తన సోదరుడి మరణవార్త తెలిసిన సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం. అదే విధంగా చంద్రబాబు తనయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. నారా రామ్మూర్తినాయుడి మరణంతో ఆయన తనయుడు, సినీ హీరో నారా రోహిత్, ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
