Nara lokesh: రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ధ్యేయమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నేత, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలంటూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గం టిడిపి నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మచిలీపట్నం టిడిపికి గుండె వంటి నియోజకవర్గమని, ఇక్కడ గెలుపు సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా విజయానికి బలం లభిస్తుందని లోకేశ్ అన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెడితేనేమీ, ఆయన ధైర్యంగా టీడీపీ కోసం నిలబడ్డారని ప్రశంసించారు.
కష్టాలను మర్చిపోవద్దు – అహంకారానికి దూరంగా ఉండాలి
తాను మచిలీపట్నం రావడాన్ని తెలుసుకున్న అధికారులు దారిపొడవునా పోలీసులతో పహారా ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విజయానికే నిదర్శనమన్నారు. ఒకప్పుడు అక్రమంగా నిర్బంధించిన చంద్రబాబును, ఆయన నిర్మించిన జైలులోనే ఉంచిన విషాన్ని గుర్తు చేస్తూ – “జైలు నుంచి పులిలా బయటపడ్డారు” అని వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్నప్పుడు గౌరవం ఉంటుంది గాని, కష్టకాలం గుర్తుంచుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని తెలిపారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని కార్యకర్తలు – చెన్నుపాటి గాంధీ, మంజులారెడ్డి, అంజిరెడ్డి తాత, తోట చంద్రయ్య త్యాగాలు శ్లాఘనీయమని అన్నారు.
“ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం నిలుపుదలకాదు. పార్టీ నిర్ణయాలన్నింటికీ కట్టుబడి ఉండాలి. జగన్‌పై కన్నా పార్టీకి నేను మూడింతలగా పోరాడాను,” అని లోకేశ్ స్పష్టం చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం
94 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలోనే అరుదైన విజయం అని, ఈ గెలుపు వెనుక ప్రజల విశ్వాసమే ఉందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, నిరుద్యోగ భృతితో పాటు, రాష్ట్రానికి కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
మహిళల గౌరవం ఇంటినుంచి ప్రారంభమవాలన్నదే టీడీపీ ధ్యేయమని, 50:50 పనుల పాఠం విద్యా ప్రణాళికల్లో చేర్చిన విషయాన్ని వెల్లడించారు. జులై 5న పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు.
ఇప్పటివరకు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మహిళల ఖాతాల్లో సబ్సిడీ జమ అవుతుందని తెలిపారు. వృద్ధాప్యులకు రూ. 4 వేల పింఛను, దివ్యాంగులకు రూ. 6 వేల నుంచి రూ. 15 వేల వరకు పింఛను అందిస్తున్నామని పేర్కొన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు – జూలై 2 నుంచి
జూలై 2 నుండి “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్లాలని లోకేశ్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిజంగా పనిచేసినవారికి తగిన గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు.
వైసీపీ తీరు మారలేదు – లోకేశ్ మండిపాటు
వైసీపీ నేతలు ఇప్పటికీ అహంకారంతో మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి కార్యకర్తలను, ప్రజలను కలవడంలేదని విమర్శించారు. “రెడ్ బుక్ పేరు వింటేనే ఒక్కరికి గుండెపోటు, మరొకరికి చేయి విరిగిపోతే అది వారి నైతిక బలహీనతకు నిదర్శనం,” అని ఎద్దేవా చేశారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు వినయంగా ఉండాలని, అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆయన – “ప్రజలు మనపై బాధ్యత పెట్టారు. దాన్ని నెరవేర్చేందుకు ఒడిసిపట్టాలి,” అని హితవు పలికారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం – కేంద్రం సహకారంతో అభివృద్ధి
ప్రధాని మోదీ సహకారంతో డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తోందని లోకేశ్ వివరించారు. విశాఖలో 3 లక్షల మందితో యోగాసనాలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించి మోదీకి కానుకగా ఇచ్చామని గుర్తు చేశారు. కూటమి శక్తిగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.