Nara lokesh: విశాఖపట్నం నగరాన్ని ప్రపంచ ప్రమాణాలకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ ఇక దేశంలోని ఇతర నగరాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడే దిశగా ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం మధురవాడలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాగ్నిజెంట్ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయడం రాష్ట్ర ఐటీ రంగంలో చారిత్రక మైలురాయి అని అన్నారు.
ఈ క్యాంపస్ కోసం సంస్థ సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తొలి దశలో 8 వేల మందికి, భవిష్యత్తులో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు లోకేశ్ తెలిపారు. ఇప్పటికే వెయ్యి మంది సిబ్బందితో తాత్కాలిక క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభమైందని చెప్పారు.
ఈ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. దీుతో విశాఖ డిజిటల్ ఎకోసిస్టమ్ మరింతగా బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
“ఈ క్యాంపస్‌లోని ప్రతి సీటు ఒక ఉద్యోగ అవకాశం మాత్రమే కాదు, మన యువత భవిష్యత్తుకు వేదిక” అని లోకేశ్ అన్నారు. కాగ్నిజెంట్ ఉద్యోగులు విశాఖకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు.
దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న ప్రధాని మోదీ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు స్ఫూర్తి కావాలని లోకేశ్ సూచించారు. రాష్ట్రంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అందరూ కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్, విశాఖ, తెలుగు ప్రజలు గర్వపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
