AP News: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. చింతూరు-మారేడుమల్లి ఘాట్‌రోడ్డులో జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితులకు తక్షణ సహాయం అందించాలని, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగిన తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం, చింతూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే, ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స ఖర్చుల కోసం రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకుని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు.
