Fire Accident

Fire Accident: నాంపల్లి భారీ అగ్నిప్రమాదం.. కీలక సాక్ష్యాధారాలు దగ్ధమయ్యే ఛాన్స్?

Fire Accident: హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కార్యాలయ ప్రాంగణంలోని కంప్యూటర్ ల్యాబ్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటు సిబ్బంది, ఇటు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అసలేం జరిగింది?

నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ భవనంలోని ఒక విభాగంలో మొదలైన మంటలు, లోపల ఉన్న రసాయనాలు, ఫైళ్లకు అంటుకోవడంతో క్షణాల్లోనే ఇతర విభాగాలకు వ్యాపించాయి. కార్యాలయం నుంచి దట్టమైన పొగ రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి.

ప్రస్తుతం ఖైరతాబాద్ డిసిపి శిల్పవల్లి అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భవనంలో ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సాక్ష్యాధారాలపై అధికారుల ఆందోళన

ఈ ప్రమాదం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అనేక నేరాలకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు, డిజిటల్ రికార్డులు,రసాయనాలు ఉంటాయి. మంటలు వ్యాపించిన విభాగంలో కీలక పత్రాలు ఏవైనా ఉంటే, కేసుల విచారణపై అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దానిపై అధికారులు ఇంకా ఒక అంచనాకు రాలేదు.

కారణం అదేనా?

ప్రాథమిక విచారణ ప్రకారం, కంప్యూటర్ ల్యాబ్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే రసాయనాలు ఉన్న ప్రదేశం కావడం వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉండవచ్చు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *