Nampally: కీలక హార్డ్ డిస్కులు, పత్రాలు దగ్ధం!

Nampally: నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో ఈరోజు (శనివారం) ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదం ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, ఫైర్ డీఎఫ్‌వో శ్రీరామ్ దాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో వివరాలను పంచుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వాళ్ళ ఈ ప్రమాదం జరిగినట్టు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఐదు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తిచుకొచ్చారు.

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం

ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో నలుగురు ఉద్యోగులు ఉండగా, వారు మంటలను గమనించి వెంటనే సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే, అక్కడే పనిచేస్తున్న వార్డు బాయ్ కృష్ణ, మంటలను ఆర్పే క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కీలక సాక్ష్యాధారాలు దగ్ధం?

ఈ ప్రమాదంలో ఆస్తి నష్టంతో పాటు నేర పరిశోధనకు సంబంధించిన కీలక సమాచారం కాలిపోయినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • మొదటి అంతస్తులో నష్టం: ఫైర్ డీఎఫ్‌వో శ్రీరామ్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం, మొదటి అంతస్తులోని ‘సీజ్డ్ ప్రాపర్టీ’ (వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వస్తువులు) విభాగంలో మంటలు చెలరేగాయి. ఇక్కడ ఉన్న అత్యంత విలువైన హార్డ్ డిస్కులు, కీలక డాక్యుమెంట్లు, సెన్సిటివ్ ప్లాస్టిక్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.
  • రెండో అంతస్తు సురక్షితం: రెండో అంతస్తులో కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంది. అయితే సకాలంలో మంటలను అదుపు చేయడంతో రెండో అంతస్తుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

నేర పరిశోధనలో ఎఫ్ఎస్ఎల్ నివేదికలు అత్యంత కీలకం. ఈ ప్రమాదం వల్ల పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *