Nagarjuna Sagar Dam: తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరందించే నాగార్జున సాగర్ డ్యాం భద్రతను కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. గతంలో మాదిరిగానే మళ్లీ ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రతను అప్పగించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ బలగాలను భద్రతా చర్యల నుంచి తొలగించింది. దీంతో మళ్లీ భద్రతా చర్యలను ఎస్పీఎఫ్ బలగాలే పర్యవేక్షించనున్నాయి. దీంతో గత కొన్నాళ్లుగా కొనసాగుతన్న వివాదం సద్దుమణిగే అవకాశం ఉన్నది.
Nagarjuna Sagar Dam: 2023 ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం తలెత్తింది. ఈ సమయంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఫలితంగా గత ఏడాది డిసెంబర్ 3న సాగర్ ప్రాజెక్టుకు ఏపీ, తెలంగాణ రెండు వైపులా కేంద్ర బలగాలను భద్రతకు ఉంచారు. దీంతో అప్పటి నుంచి భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని విధులు నిర్వహిస్తున్నాయి.
Nagarjuna Sagar Dam: ఈ నేపథ్యంలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. సాగర్ డ్యాం నిర్వహణ బాధ్యత తెలంగాణదేనని, వెంటనే ప్రాజెక్టును తమకు అప్పగించాలని తెలంగాణ సర్కారు కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్ 28కి ముందున్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ, జలవనరుల శాఖ రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశారు.
Nagarjuna Sagar Dam: ప్రస్తుతం సాగర్ డ్యాం భద్రత కేఆర్ఎంబీ ఆధీనంలో ఉండటంతో సీఆర్పీఎఫ్ బలగాలతో నిఘాలో ఉన్నది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన రావడంతో సీఆర్పీఎఫ్ నుంచి భద్రతాపరమైన చర్యలను ఎస్పీఎఫ్‌కు అప్పగించారు. ఇక భద్రత విధుల నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాగర్ డ్యాంపై ఇప్పటి వరకు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాల బాధ్యత తిరిగి ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వచ్చింది.