Nagababu: ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు స్పష్టీకరణ

Nagababu: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగేంద్రబాబు (నాగబాబు) ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తగా కొనసాగడంలోనే తనకు ఎక్కువ సంతృప్తి ఉందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలో పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల నాగబాబు శ్రీకాకుళంలో తరచూ పర్యటించడంతో, అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఈ ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే తన నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించినట్లు ఆయన చెప్పారు. “నాకు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉంటే గత ఎన్నికలలోనే చేసేవాడిని. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు వేచిచూడాలి? ఐదారేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఎలా చెప్పగలం?” అని నాగబాబు వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కంటే, సాధారణ పార్టీ కార్యకర్తగా పిలిపించుకోవడమే తనకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా సేవలందిస్తున్న నాగబాబు, గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ, పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కిన విషయం తెలిసిందే.

శ్రీకాకుళం నుంచి నాగబాబు పోటీ చేస్తారన్న ప్రచారం కూటమిలో అనవసర అపోహలకు దారితీయవచ్చని భావించిన ఆయన, ముందుగానే తన వైఖరిని స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ప్రకటనతో ఉత్తరాంధ్రలో నాగబాబు ఎన్నికల బరిలో దిగుతారన్న వదంతులకు తెరపడినట్లయింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *